మాదకద్రవ్యాలు జీవన వినాశకాలు

మారుతున్న ప్రజాస్వామ్య ముఖచిత్రం
August 29, 2021
కెరియర్ స్కిల్స్
August 29, 2021

    

మాదకద్రవ్య నియంత్రణ సంస్థ లెక్కల ప్రకారం భారత్లో మత్తుపదార్థాల వ్యసనపరుల సంఖ్య 30 లక్షలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతి 20మందిలో ఒకరు మద్యానికి అలవాటైనవారుంటే, ప్రతి 40మందిలో ఒకరు మత్తుపదార్థాలను తీసుకుంటున్నారని సర్వే చెబుతోంది. మత్తు వ్యసన పరులలో 15 ఏళ్లలోపు వారు 12% మంది ఉన్నారు. 16నుంచి 25 ఏళ్ల మధ్యవయస్కులు 31% మంది ఉన్నారని అంచనా! పంజాబ్లో అయితే ఏకంగా 75శాతం మంది యువత మత్తు, మాదక ద్రవ్యాల బారినపడ్డారని స్వయంగా ఆ రాష్ట్ర ప్రభుత్వమే న్యాయస్థానానికి మొరపెట్టు కోవడం నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతుంది.

దూరం పెరగడం ప్రధాన కారణం

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య దూరం పెరగడమే యువతను మత్తువైపు ఆకర్షించడానికి ప్రధాన కారణమని అంతర్జాతీయ మనస్తత్వశాస్త్ర పరిశోధనా సంస్థ చెబుతోంది. ముఖ్యంగా నగరాలలో అయితే వారానికి కనీసం 30నిమిషాలు కూడా తమ సమయాన్ని పిల్లలతో తల్లిదండ్రులు గడపలేకపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు కూడా తమకు ఎదురైన ప్రతి విషయాన్ని ఇంట్లో స్వేచ్ఛగా చెప్పే స్వాతంత్య్రం లేకపోవడం, తమ అభిప్రాయాలను పంచుకోడానికి కన్నవారికి తీరిక లేకపోవడం వంటి సమస్యలతో పిల్లలకు, తల్లిదండ్రులకు మద్య పెద్ద అగాధాలు ఏర్పడు తున్నాయంటున్నారు. సామజిక విశ్లేషకులు.

బాధైనా, ఆనందమైనా దానితోనే

ఆనందమైనా, బాధనైనా మందు పార్టీతోనే అనే విష సంస్కృతి పెచ్చుమీరిన రోజులు. దాంతో 15ఏళ్ల వయసుకే మద్యం రుచిచూస్తున్నారు. సరదాగా మొదలైన అలవాటు, మొదట పొందిన అనుభూతిని మళ్లీ పొందడం కోసం మనసు బాగోలేదనో లేక ఏదో సంతోషం కలిగిందనో వంకతో పార్టీలో పాల్గొంటారు. అలా అలవాటైన తర్వాత ఇక ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలన్నింటినీ మత్తుతో పంచుకోవడం మొదలవుతుంది. అలా మత్తుపదార్థాలు సేవించడం జీవితంలో భాగమవడం ప్రారంభమవుతుంది. కావాలంటే రేపటి నుంచి వాటిని తీసుకోకుండా ఉండగలను అని అనుకుంటూనే, ఇక అవి లేకుండా గడపలేని పరిస్థితికి నెట్టవేయబడతారు. అలానే చాలా మంది మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతారని చెబుతున్నారు. మనస్తత్వ నిపుణులు డా.రమణ చెరుకూరి. ఎక్కువశాతం మద్యం సేవించే సమయాలలోనే యువతకూ గంజాయి, కొకైన్ వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారంటున్నారు. విశ్లేషకులు.

గంజాయి కేసులు ఎక్కువే

గత మూడేళ్లతో పోలిస్తే మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారి సంఖ్య 18.5శాతం పెరిగిందని జాతీయ నేరగణాంక సంస్థ లెక్కలు చెబుతున్నాయి.

తమ వద్దకు చికిత్స కోసం వచ్చే 20మంది రోగులలో 3 నుంచి 4గురు మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యసనపరులైనవారే వస్తున్నారని చెబుతున్నారు నగరానికి చెందిన ఓ ప్రముఖ సైకియాట్రిస్ట్. అంతకన్నా యథేచ్ఛగా వాటి అమ్మకాలు సాగుతున్నాయనేది గమనించాల్సిన మరో అంశం.

ఊబి నుంచి బయటకు

మత్తుపదార్థాల వ్యసనం మనిషిలోని మానవత్వాన్ని మరుగున పడేస్తుంది. విచక్షణ నశిస్తుంది. సంఘవ్యతిరేక మార్గంలో నడిపిస్తుంది. మనసు మంచిగా ఆలోచించినా…! బుద్ధి అసలు సహకరించదు. ‘నన్ను ఈ ఊబి నుంచి ఎవరైనా బయటకి లాగితే బాగుండు’ వ్యసనపరులైన చాలామంది మదిలో మెదిలే ఆశ ఇది! కానీ ఊబిలో కూరుకుపోతున్న మనిషిని చూస్తే చాలు బంధు, మిత్రులు ఛీత్కరిస్తారు. పరువుతీస్తున్నావంటూ ఇంట్లో వారు ఏకరువుపెడతారు. ఇరుగుపొరుగు దగ్గరకు కూడా రానివ్వరు. ఇక ఆ మనిషిలో మార్పు ఎలా వస్తుంది. ఆ వ్యక్తి బాధ వినేదెవరు. పట్టించుకునేదెవరు.

సమాజంతో సంబంధాలు మృగ్యమవుతాయి. తీవ్ర స్థాయికు నెట్టవేయబడతారు. ఇక ఆ మనిషిలో మార్పుకు జరిగిన ప్రయత్న ప్రయత్నం అక్కడే ఆగిపోతుంది. అందుకే ఆ నిర్భాగ్యులు చెప్పే మాటలు మొదట వినండి అంటూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా పిలు వచ్చింది. ఆ వ్యక్తి తప్పులనేకాదు, వారిలో మిగిలున్న మంచితనాన్ని ప్రేమతో, ఆప్యాయతతో వెలికితీయాలి! వాటికి పదును పెట్టాలి! అందుకు ముందుగా ఆ వ్యక్తి మాటలు వినడానికి సిద్ధపడాలి. అప్పుడు ఆ వ్యక్తి అలవాటు మధ్యలోనే ఆపేసి కొత్త జీవితం గడవడానికి ద్వారాలు తెరిచినవారమవుతాం. అంతేకాదు అసలు మత్తుబారిన పడకుండా పిల్లలు చెపేది. మొదట వినండి అనే అర్థాన్ని సందేశం ద్వారా ప్రపంచ దేశాలకు తెలిపింది ఐఖ్యరాజ్యసమితి.

పిల్లలు చెప్పేది మొదట వినండి! 

ప్రపంచవ్యాప్తంగా 20కోట్ల మందికి పైగా మాదకద్రవ్యాల వ్యసనపరులున్నారని ‘యూఎన్టీఓడీసీ’ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఏడాదికి 1,80,000 మంది మరణిస్తున్నారు.వారంతా 18 నుంచి 35 ఏళ్లలోపు వారే! మత్తుకు అలవాటవుతున్న వారు ఎక్కువగా కుటుంబం నుంచి సంఘర్షణలు ఎదుర్కుంటున్నవారు, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోనివారు, ఒంటరి తనంతో బాధపడుతున్నవారే ఎక్కువని ప్రపంచ మనస్తత్వశాస్త్ర అధ్యయనాలు ఘోషిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయం కేటాయించాలి.

వారు చెప్చేవి మొదట వినాలి. మీకు ఇష్టంలేని విషయాలు వారి నోటి నుంచి వచ్చినా వాటిని మొదట వినాలి అని ఐఖ్యరాజ్యసమితి చెబుతోంది. ” పిల్లలు చెప్పే ప్రతి మాటను శ్రద్దగా వినడం వల్ల, వారి ఆలోచనలు, స్నేహితులు, పాఠశాల వాతావరణం వంటి విషయాలన్నీ తెలుస్తాయి. ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా ఇంట్లో చెప్పే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వారికి ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే విచక్షణను తెలిసెలా చేయగలరు” అంటున్నారు పిల్లల మానసిక నిపుణులు డా॥ మాధురి తల్లిదండ్రుల వైఖరి తల్లిదండ్రులు తమ పిల్లల కార్య కలాపాలపై ఓ కన్నేసి ఉంచాలి. వారి దైనందిన కార్యక్రమాలు, ఎవరితో కలుస్తున్నారు, ఎవరి సాంగత్యంలో ఉంటున్నారో పరికించాలి. తమ పిల్లలకోసం సమయాన్ని కేటాయించి వారి సమస్యలను పరిష్కరించాలి. పిల్లల సంస్కారాలను అలవాట్లను దిద్దడం ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. కానీ నేటి ఆధునిక సమాజంలో బంధుత్వాలకు, సంస్కార శిక్షణలకు సమయాన్ని కేటాయించడం కరువైపోయింది. పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండటం తల్లిదండ్రుల బాధ్యతకూడా.

ప్రభుత్వాల బాధ్యత

మాదకద్రవ్యాలను ప్రభుత్వాలు నిషేధించినా మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు బలౌతున్నారు. యువకులు క్రమేపి కొకైన్, హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిపోతున్నారు. కొన్ని మాదకద్రవ్యాల కేసులలో ప్రత్యేక్షంగా గానీ పరోక్షంగాగానీ రాజకీయ నాయకుల ప్రమేయాలు కూడా బయటపడ్డాయి. తమ మందబలం, అర్థబలంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడే వారి నుంచి ప్రభుత్వాలకూ తెలియనిది కాదు. ఆర్బాటాలకోసం ప్రచారాలు కాకుండా ప్రజల జీవితంతో నేరుగా ముడిపడి ఉ న్న ఇటువంటి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించి నేరస్తులపై కొరడా ఝళిపిస్తూ అన్ని రకాల మత్తు పదార్థాలను సంపూర్ణ మద్య నిషేదాన్ని అమలు చేయాలి. తద్వారా మాదకద్రవ్యాల వంటి సమస్యలను అధిగమించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *