పాలకుల ఆవేదన

ప్రళయం
August 28, 2021
విమర్శ- పరమార్థం
August 28, 2021

హారూన్ అల్ రషీద్ పరిపాలించిన కాలం అది. అప్పట్లో మక్కా ప్రజలు పంచ భక్ష్య పరమాన్నాలు భుజించినా, పీతాంబరాలు ధరించినా దోసెడు నీళ్ళకు నానా అవస్థలు పడేవారు. ప్రజలంటే అవధుల్లేని ప్రేమగల హారూన్ అల్ రషీద్ సతీమణి జుబైదా హృదయం నీటి కొరకు అల్లాడే మక్కా ప్రజల్ని తలచుకుని చాలా బాధ పడేది. ఎడారి ప్రాంతంలో ఓ మంచినీటి కాలువ ప్రవహింజేయాలి – ఎలా? అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. మక్కా వాసుల మంచినీటి కోసం రాజ్యంలో వున్న సాంకేతిక నిపుణుల్ని అందరినీ ఆహ్వానించింది. వారంతా సమావేశమయ్యారు. జుబైదా గారు తన మనోవేదనను వ్యక్తం చేసి, మక్కావాసులు నీటి ఎద్దడిని దూరం చేసేందుకు ఉపాయం ఏమిటో ఆలోచించాలని ఆదేశించిందామె. ఏ మాత్రం ఆలస్యం చేయక ప్రయత్నాలు మొద లెట్టారు. చుట్టు ప్రక్కల నున్న ప్రదేశాలన్నీ గాలించారు. నీటి వనరులున్న ప్రాంతాలు పరిశీలించారు. నీరు మక్కాపురం చేర డానికి పథకాలు, ప్లాన్ లు తయారు చేశారు.

పథకాలు, ప్లాన్లతో ఖలీఫా సతీమణి వద్ద సమావేశమయ్యారు. “అయ్యా! సమస్యకు పరిష్కారం దొరికింది. తాయిఫ్ లోయలో చక్కటి సెలయేరు వుంది. అది హునైన్ కొండల వైపునకు ప్రవహిస్తూంది. ఆ నీళ్ళు అమృతతుల్యంగా వున్నాయి. కాని దాన్ని మక్కాకు మళ్ళించడం సాధ్యం అయ్యేలా అగుపించడంలేదమ్మా! ఈ పని అంత సులభం కాదు. ఎన్నో కొండలు, గుట్టలు, బండరాళ్ళు మార్గంలో అడ్డు వస్తున్నాయి. ఈ అవరోధాల్ని తొలగించి కాలువ కట్టవలసి ఉంటుంది. ఈ పొడవైన కాలువ కట్టించడం ఎంతో ఖర్చుతో కూడిన పని అని విన్నవించుకున్నారు.

నిపుణులు చేసిన సిఫారసు జుబైదా పరిశీలించి, “ఖర్చును ఖాతరు చెయ్య కండి. ప్రజల సౌకర్యం ముందు అదెంత? పని ప్రారంభించండి. అవసరమయితే త్రవ్వకాలలో ప్రతి గునపం దెబ్బకు ఒక బంగారు నాణెమయినా సంతోషంగా ఖర్చు చేస్తాను అని ధైర్యంగా చెప్పింది. జుబైదా. నిపుణులు తాయిఫ్ లోయలో పుట్టిన ఊటను మక్కాకు చేర్చేందుకు కాలువ త్రవ్వించారు. దారిలో వచ్చిన ఎన్నో చిన్న చిన్న ఊటల్ని ఈ కాలువలో కలుపుకుంటూ వచ్చారు. కాలువ రాను రాను నదిగా మారి మక్కాకు చేరింది. ‘సహరె జుబైదా’ పూర్తయి ప్రజలకు మంచి నీటి వసతి కలిగింది.

ఈ బృత్కార్యానికి ఎంతో మంది కష్టపడ్డారు. ఎంతో డబ్బు ఖర్చు అయింది. అయితేనేం ప్రజలకు మంచి సౌకర్యం లభించింది. జుబైదా కల నెరవేరింది. ఈ పని ప్రళయం వరకు నిలిచేట్టు జరిగింది. సహరె జుబైదానే కాకుండా ఆమె కాబా లోని జమ్మ్ బావిని కూడా మరమ్మత్తు చేయించారు. ఆనాటి మంచినీటి పథకం ‘సహెరె జుబైదా’ నేటికీ అక్కడి ప్రజలకు మరియు లక్షలాది సంఖ్యలో ఏటేటా వచ్చే హజ్ యాత్రీకులకు నీరు సరఫరా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *