ఉన్నత విద్య వెలవెల

Vestibulum commodo volutpat laoreet
May 8, 2014
ఆండ్రాయిడ్ తో కొలువుదీరుదాం..!
August 28, 2021

విశ్వవిద్యాలయాలు విజ్ఞానకేంద్రాలు. జ్ఞానకిరణాలు ప్రసరించే వెలుగుదివ్వెలు. మేథోసంపత్తి నిలయాలు. ఉన్నతవిద్యకు చెరగని చిరునామాగా మారాల్సిన విశ్వ విద్యాలయాలకి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అధ్యాపకుల కొరత, మౌలికవసతుల లేమి వేధిస్తున్నాయి. ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా మారాయి. ప్రపంచంలో 200 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో మన దేశం నుంచి ఒక్కదానికీ చోటు దక్కకపోవడంపై మేధావుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక పరిశోధనల సంగతి సరేసరి! మేధా వులు ఉన్నత విద్యారంగాన్ని వీడి ఇతర రంగాలకు మరులుతున్నారు. మరోపక్క లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెడుతున్నా ఉన్నత విద్యకు కేటాయింపులు అంతంత మాత్రమే. మొత్తంగా దేశంలో ఉన్నతవిద్య నేడు వెలవెలబోతోంది. ప్రాంతీయ ప్రాథ మ్యాలు, సామాజిక వర్గాల పేరిట సాగే పదవుల పందేరాలు… ఉన్నత విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నాయి. కొత్త ఆలోచనలు, వ్యక్తిత్వవికాసం, అర్థవంత మైన జీవితాలన్న మౌలికలక్ష్యాల సాధనలో ఉన్నత విద్యావ్యవస్థ విఫలమైందన్న విమ ర్శలు అంతటా వినిపిస్తున్నాయి.

వర్శిటీలు… వెలవెల

ఉన్నతవిద్యను పటిష్టపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని పదేపదే చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో తగు సంఖ్యలో అధ్యాపకులు లేక విద్యాగంధం ఆవిరై పోతోంది. ఆశించిన స్థాయిలో విద్యా బోధన జరగడంలేదు. సరైన అధ్యాపకులు లేక విద్యార్థులకు మార్గదర్శకత్వం కరువవుతోంది. మరోవైపు యూనివర్శిటీల్లో పరిశోధన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీనికితోడు కొన్నేళ్లుగా పరిశో ధనకు విద్యార్థులు కరువయ్యారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా వర్శిటీల్లో లైబ్రరీ, లేబొరేటరీ సౌకర్యాలు ఏమాత్రం పెరగటంలేదు. మరోవైపు అకడమిక్ సెక్షన్లు పని చేయడం లేదు. కాలానుగుణంగా కొత్త కోర్సులను రూపొందించేం దుకు యూనివర్శిటీలు చొరవ చూపడం లేదు. కనీసం ఉన్న కోర్సుల సిలబస్ సైతం రివైజ్ చేయడం లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిధుల లోటులో…. వర్శటీలు

ఇంచుమించుగా రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు ఆర్థిక స్వావలంబన లేక విలవిలలాడుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం బడ్జెట్ 99కోట్లు అంచనా కాగా యూనివర్శిటీకి దక్కిన నిధులు 81 కోట్లు మాత్రమే. అంటే 12కోట్ల రూపాయల లోటు కనిపిస్తోంది. ఇది వరుసగా మూడో సంవత్సరం లోటు బడ్జెట్. ఈ మొత్తంలో 87% ఉద్యో గుల జీతభత్యాలు, పెన్షన్లకే సరిపోతుంది. 11.50% ఇతర అవసరాలకు ఖర్చవు తుంది. ఇందులో ఎక్కడా లైబ్రరీ, రీసెర్చి, లేబొరేటరీ వంటి వాటికి కేటాయింపులు లేకపోవడం గమనార్హం. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిస్థితే ఇలా ఉంటే, రాష్ట్రంలోని మిగిలిన వర్శిటీల స్థితిని ఇట్టే ఊహించొచ్చు. మరోవైపు వర్శిటీలకు బ్లాక్ గ్రాంట్లు పెంచడం సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరో మూడు కొత్త యూనివర్శిటీలకు ఎటువంటి హంగులు, సౌకర్యాలు ఏర్పాటు చేయగలదో వేచి చూడాల్సిందే. ఇంచుమించుగా దేశంలోని అన్ని యూనివర్శిటీలు ఆర్థిక స్వావలంబన లేక విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మేధావులతో పాటు సమా చార జ్ఞానం.. ఉన్నత విద్యారంగాన్ని వీడి ఇతర రంగాలకు తరలిపోతోంది.

ఐఐటీలకు… ఆఖిరిస్థానం

చైనాలో షాంగై జియోవొటోంగ్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 2వేల యూనివర్శిటీల పరిశోధనల వివరాలను సేకరించి ర్యాంకింగ్లు సూచించింది. ఈ సర్వే ప్రకారం పేరుమోసిన 500 యూని వర్శిటీల జాబితాలో భారత్కు చెందిన మూడేమూడు వర్శిటీలున్నాయి. అందులో మనం గొప్పగా చెప్పుకునే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు దక్కిన స్థానం 251 నుంచి 300లోపు మాత్రమే. ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మొత్తం 149 దేశాల్లో భారతదేశం 119వ స్థానంలో ఉండటాన్నిబట్టి మన స్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు దేశం లోని రాజకీయ నాయకత్వానికి విజ్ఞాన శాస్త్రాల గురించి కనీస అవగాహన కూడా లేకపోవటంతో ఆ రంగం బాగోగులపై దృష్టి సారించే వ్యక్తులే కరువయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతే ఆయా దేశాల పురోభివృద్ధికి బాటలు పరుస్తుం దన్నది చారిత్రక సత్యం. నేడు అగ్ర రాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్లింది శాస్త్రసాంకేతిక రంగాలే అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. శాస్త్ర సాంకే తికరంగాలకు విద్య, పరిశోధనలే వెన్ను దన్ను. వాటి కారణంగానే శాస్త్ర సాంకేతికరంగాలకు ఒక విలువ ఏర్పడు తుంది. ఓ అంతర్జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో 40వేల కంపెనీల పుట్టుకకు మూలాలున్నాయి. అవి దాదాపు 54లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. సంప్రదాయ పద్ధతుల ద్వారా తీరని ఆశలెన్నో ఆధునిక పరిశోధనలతో తీరతాయన్నది కాదనలేని సత్యం. వర్శిటీల్లో అధ్యాపకుల కొరతతో విద్యారంగం ఇగిరిపోతోంది. సరైన ప్రొఫె సర్లు లేక విద్యార్థులకు మార్గదర్శకత్వం కరవవుతుంది. పరిశోధనల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసలు పరిశోధనకు విద్యార్థులే కరువయ్యారు.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వర్శిటీల్లో లైబ్రరీ, లేబోరేటరీ సౌకర్యాలు ఏమాత్రం పెరగటం లేదు. మరోవైపు అకడమిక్ సెక్షన్లు పనిచేయడం లేదు. కాలాగుణంగా కొత్త కోర్సులను రూపొం దించేందుకు యూనివర్శిటీలు చొరవ చూపడం లేదు. కనీసం ఉన్న కోర్సుల సిలబస్పైనా పునఃసమీక్షించడం లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. దేశంలోని మూడింట రెండొంతుల విశ్వవిద్యాలయాలు అంతంతమాత్రమైన విద్యా ప్రమాణాలతో కలవరపెడుతున్నాయి. 90% కళాశాలల్లో నేలబారు ప్రమాణాలు వెక్కిరిస్తున్నాయి. 1950లో దేశంలో ‘డీమ్డ్’ సహా 30 విశ్వవిద్యా లయాలు, 750 కళాశాలలు ఉండేవి. ఆనాడు మొత్తం అధ్యాపకులు పది హేనువేల మంది కాగా, విద్యార్థులు లక్షకు చేరువలో ఉన్నారు. అదే 2014 వచ్చేసరికి 637 వర్శిటీలతోపాటు, 25 వేల కాలేజీలు పైగా లెక్కకు వచ్చాయి. అధ్యాపకుల సంఖ్య ఐదు లక్షలు దాటి పోగా, విద్యార్థులు కోటీ 16 లక్షల పైమాటేనని గణాంకాలు చెబుతున్నాయి. అయితే పుట్టగొడుగుల్లా పుట్టు కొచ్చిన వర్శిటీలు, కాలేజీలు… కేవలం అలంకార ప్రాయమయ్యాయన్న విమర్శ వెల్లువెత్తుతోంది.

విజ్ఞానశాస్త్రాలకు …. విద్యార్థులు దూరం 

వాస్తవానికి దేశంలో విజ్ఞానశాస్త్రాల్లో పరిశోధన రానురాను మందగిస్తోంది. నేడు యూనివర్శిటీల సంఖ్య 431 చేరుకున్నా వాటిలో కనీస ప్రమాణాలతో కూడిన శోధనలు సాగటంలేదు. దేశవ్యాప్తంగా 1350 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు న్నాయి. 1200 జాతీయ ల్యాబొరేటరీలు, 39 అనుబంధ సంస్థలు, 11 చిన్న తరహా జాతీయ సంస్థలు పని చేస్తున్నా విద్యార్థులు ఆకర్షించలేకపోతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మన ఐఐటీలు సైతం ప్రపంచ దేశాల్లోని తొలి 100 అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థల్లో చోటు సంపాదించుకోలేకపోవటం విస్మయం కలిగిస్తోంది. 1950ల్లో సైన్స్ చదువుల వైపు 31% విద్యార్థులు మొగ్గు చూపారు. అదే తొంభైలకు వచ్చేసరికి సైన్స్ విశిష్ట తను చాటి విడమర్చి చెప్పేవారే కరువ య్యారు. దీంతో సైన్స్ కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య నేడు 20 శాతానికి పడి పోయింది. ఇంజినీరింగ్, వైద్య విద్యను అందుకోవ టానికి మాత్రమే అధికశాతం విద్యార్థులు సైన్సును ఉపయోగించుకుంటున్నారు. సైన్స్ డిగ్రీలు, పీజీలు చేసినా సరైన ఉద్యోగాలు లభించటం కరువైపోయింది. పీహెచీలు చేసినవారు సైతం చిన్నా చితకా ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అదే అమెరికా, జపాన్, జర్మనీల్లో సగటున 10లక్షల జనాభాకు 3వేళ 805 మంది శాస్త్ర పరిశోధకు లుంటే… మన దేశంలో ఆ సంఖ్య కేవలం 149మంది మాత్రమేనని ప్రపంచ అభివృద్ధి నివేదిక తెలిపింది.

కుంటుతున్న…. సైన్స్

మన దేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో అనుకున్న ప్రగతిని సాధించలేకపోతోంది. గ్రామీణ భారతం సమగ్రాభివృద్దే లక్ష్య మని ప్రభుత్వాలు చెబుతున్నా పరిశోధ నలు మాత్రం ఆ దిశగా సాగటం లేదు. ప్రయోగ ఫలితాలు గ్రామాలకు చేరటం లేదు. దేశంలో ఏటా జరిగే సైన్స్ కాంగ్రెస్ సిఫారస్లు ఏమాత్రం అమలుకావటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. పరిశోధన లకు, ఫలితాలకు మధ్య అగాథాన్ని శాస్త్ర వేత్తలు వేలెత్తి చూపుతున్నా… ప్రభుత్వాల్లో ఉలుకూ పలుకూ లేకపోవటం నేటి విషాదం. పైగా ఈ రంగాలకు నిధుల కేటాయింపు నామమాత్రంగా ఉంటోంది. 1980లో మనం పరిశోధనలపై పెట్టిన వ్యయం 760 కోట్ల రూపాయలు కాగా,2003 నాటికి అది 13 వేల కోట్ల రూపాయ లైంది. కాలానుగుణంగా నిధుల కేటాయింపు పెంచాల్సింది పోయి ప్రభుత్వం కోత విధిస్తోంది. 2009-10 బడ్జెట్లో ఒక్క రక్షణ రంగానికే లక్షా 41 వేల 703 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం… శాస్త్ర, సాంకేతిక రంగాలకు పదివేల కోట్లు దాటించలేకపోయింది. దీంతో 80ల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందడుగు వేసిన భారత్.. ఆ తర్వాత కాలంలో క్రమంగా తిరోగమన దిశలో సాగింది. ఫలితంగా గ్రామీణాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దాదాపు 70% ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయం వాటా స్థూల జాతీయోత్పత్తిలో 55% నుంచి 20శాతానికి పడిపోయింది. ప్రతి రెండు రైతు కుటుంబాల్లో ఒకటి రుణగ్రస్థ మైంది. దేశంలో రెండున్నర లక్షల గ్రామా లకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. అలాగే దాదాపు 12 కోట్ల కుటుంబాలు వంటకోసం ఇంకా కట్టెలు, పిడికలను ఆశ్రయిస్తున్నాయి. మొత్తం గ్రామీణుల్లో 2.7% వంటకు కిరోసిన్ వాడుతుంటే, 5శాతం మాత్రమే వంట గ్యాస్ వినియో గించగలుగుతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రజల్లో 5% బ్రాంకైల్ ఆస్తమా, 16% బ్రాంకైటిస్, 8% శ్వాససంబం ధమైన క్షయ, 7% ఛాతీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంతే కాదు దేశంలోని నిరుపేదలైన గ్రామీణ ప్రజలను అంటు వ్యాధులు, విషజ్వరాలు తరచూ పట్టిపీడి స్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచి సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధించటానికి శాస్త్రసాంకేతిక రంగాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు దేశంలో జరిగే విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల ఫలితాలు పరిశోధనా శాలల నుంచి పంట పొలాలకు, గ్రామీణ భారతానికి చేరి నప్పుడే నిజమైన అభివృద్ధి ఫలాలు దక్కేది.

విదేశాల్లో 3శాతం….

  మనదేశంలో కేవలం 1 శాతం

శాస్త్ర సాంకేతిక రంగాలకు వివిధ దేశాలు కేటాయిస్తున్న నిధుల విషయా నికొస్తే… రెండు దశాబ్దాల కిందటే జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ దేశాలు తమ జాతీయాదాయంలో 3 శాతాన్ని వెచ్చించి పరిశోధనకు గల ప్రాముఖ్యాన్ని చాటాయి. మొత్తమ్మీద అభివృద్ధి చెందిన దేశాలు శాస్త్రసాంకేతిక రంగాలే అభివృద్ధికి చోదక శక్తులన్న వాస్తవాన్ని గుర్తించి తమ స్థూల జాతీయోత్పత్తిలో ఏనాడూ 2% కంటే తక్కువ కాకుండా నిధులు కేటాయిస్తు న్నాయి. మన ప్రభుత్వాలు మాత్రం శాస్త్ర సాంకేతిక రంగాలకు స్థూల జాతీయా దాయంలో ఒక్క శాతానికి మించి కేటాయించలేక పోతున్నాయి. అసలు దుస్థితికి కారణాలేమిటన్నది ఓసారి పరిశీలిద్దాం.

అవినీతి… అశ్రితపక్షపాతం!

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితిని ఒకసారి అవలోకిస్తే చేదు నిజాలు బయట పడ్డాయి. మన విశ్వవిద్యాలయాలు రాజకీయ కార్యకలాపాలకు వేదికలుగా మారాయని, వాటి పాలకమండళ్లు అవినీతిమయమయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ నియామ కాలతోపాటు వారి సర్వీసు వ్యవహారాలు, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి, వివిధ బోర్డుల ఏర్పాటు, కొత్త కాలీజీలకు అనుమతి, పనితీరుపై నివేదికలు… వంటి కీలక వ్యవహారాలన్నీ ఆయా వర్శిటీల పాలకమండళ్ల ఇష్టానుసారమే జరుగు తుంది. ఫలితంగా పాలకమండి పదవుల కోసం ఆరాటం పెరిగింది. అశ్రితపక్షపాతం రాజ్యమేలగా, ఆపైన ప్రతి పనికి ఒక “ధర” అన్న మాట తరచు వినిపిస్తోంది.. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీ అక్రమాలకు, అన్యాయాలకు నిలయంగా మారిందని అప్పట్లో ‘కాగ్’ ఘాటైన వ్యాఖ్య చేసింది.

ఆంధ్రా యూనివర్శిటీ పాలక మండలి సభ్యులు ఇద్దరు వర్శిటీ ఖర్చు లతో రెండుసార్లు విదేశాలకు వెళ్లారు. 2004-2007 మధ్య కాలంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 150 అధ్యాపక పోస్టులను భర్తీ చేయగా… ఒక్కో పోస్టుకు పది లక్షలు పలికినట్టు సమాచారం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధ్యాపక నియామకాల్లో పాలక మండలి సభ్యులు కొందరు… డబ్బుకి కక్కుర్తి పడ్డట్టు ఆరోపణలొచ్చాయి. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో సహాయ అధ్యాపకుల నియామకాల్లో అవకతవక లపై విచారణకు ప్రభుత్వం ఇప్పటికే ఏక సభ్య కమిషనన్ను నియమించింది. ఇలాంటి వ్యవహారాల్లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, వేమన, తెలంగాణ యూనివర్శిటీలు సయితం ముందే ఉన్నా మంటున్నాయి. 

   వర్సిటీల్లో రాజకీయ వైభోగం!

గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల నియామకం, వాటి పని తీరు ప్రహసనంగా మారింది. పాలక పార్టీ నేతల పదవుల పందేరంలో వర్శిటీలు ముందుండటం విశేషం. రాజకీయ ప్రాబల్యం వున్న పాలక మండళ్ల చేతిలో వీసీలు కీలుబొమ్మలవు తున్నారన్న ఆరోపణలున్నాయి. వర్శిటీల్లో జరిగే నిర్మాణాల్లో అవకతవకలు, ప్రయోగ పరికరాల కొనుగోళ్లలో సొమ్ము దుర్విని యోగం, సిబ్బంది నియామకాల్లో అక్ర మాలు… వాస్తవ స్థితికి అద్దం పడుతున్నా యని విద్యార్థి, మేదావి వర్గాలు వాపో తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త పాలక మండళ్ల విషయంలో రాజకీయ జోక్యానికి తావీయకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. విద్య, పరిశోధనలతోపాటు, ఉద్యోగ రంగంతో సంబంధం ఉన్న పరిశ్రమలు, వ్యవస్థల ప్రతినిధులను వీసీలుగానూ, పాలక మండళ్ల సభ్యులుగా నియమిస్తే వర్సిటీల ప్రమాణాలు మెరుగు పడే అవకాశం ఉంది. హేతుబద్ధత, న్యాయసూత్రాల ఆధారంగా యూనివ ర్సిటీ నియామకాలు జరిగిన నాడే.. వాటి ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం నెరవేరు తుంది. కోర్సుల రూపకల్పన, వాటి ఆచ రణలకు సంబంధించి ప్రొఫెసర్ ఆర్వీఆర్ నేతృత్వంలోని అధ్యయనం కమిటీ చేసిన సూచనల్లో ఏ ఒక్క దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కోర్సుల రూపకల్పనైనా, పాలక మండళ్ల నియామకమైనా ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా జరిగినప్పుడే వర్శిటీ విద్యకు వన్నె.

ప్రమాణాలు పట్టని డీమ్డ్!

స్వయం ప్రతిపత్తి సంస్థలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల వల్ల విద్యా వ్యవస్థలో గందరగోళ పరిస్థితికి తావు ఏర్పడిందన్న అభిప్రాయాన్ని ఇటీవల విశాఖలో జరిగిన వీసీల సదస్సు వ్యక్తం చేసింది. నాణ్యమైన ఉన్నత విద్యకు చెరగని చిరునామాలైన ‘బిట్స్’ వంటి సంస్థలు డీమ్డ్ హెూదాకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టాయి. 1956-90 మధ్యకాలంలో మూడు పదులకు మించని డీమ్డ్ జాబితా… నేడు నాలుగింత లయ్యింది. డీమ్డ్ వర్శిటీల్లో ప్రవేశాల వ్యవహారం యాజమాన్యాల ఇష్టా రాజ్యంగా నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ లాంటి కోర్సులో చేరే అభ్యర్థి * నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా… డీమ్డ్ హెూదా ఉన్న కాలేజీల్లో ఫీజు వసూలులో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిబంధనలు లేవు. ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేసే డీమ్డ్ వర్శిటీలకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనను ఈ వీసీల సదస్సు సమర్థించింది.

సంస్కరణలు…. వాస్తవాలు

ఉన్నత విద్యలో ప్రభుత్వాలు చేపడు తున్న సంస్కరణలన్నీ ‘గ్యాట్’ ఒప్పందం నేపథ్యంలోనేనన్న విమర్శలు వెల్లువెత్తుఉ న్నాయి. మన విద్యార్థులు కొందరు విదేశా లకు వెళ్ళడానికీ, విదేశీ సంస్థలు మన గడ్డపై కాలుమోపడానికి మాత్రమే దోహద పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో 3,4 శాతాల మధ్యే ఉన్న విద్యా రంగానికి నిధులు దక్కుతున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు రాని వారు మాత్రమే మూడేళ్ళ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. రెండేళ్ల పీజీ కోర్సులకు… అందులోనూ సామాజిక మానవీయ శాస్త్రాల కోర్సులకు అసలే చెలామణీ లేకుండా పోయింది. మొత్తానికి దేశంలో ఉన్న విద్యను అందుకొంటున్నవారు నేటికీ 11 శాతం లోపే కావటం విస్మయం కలిగిస్తోంది. అదే అమెరికా, కెనడాల్లో యువత 60% మేరకు ఉన్నత విద్యను అందుకోగలుగుతున్నారు. మన విశ్వ విద్యాలయాల్లో నిర్మాణాత్మక మార్పులు వస్తేనే…. వచ్చేతరాలు నిలకడగా అభివృద్ధి చెందుతాయన్న వాస్తవాన్ని మన ప్రభు త్వాలు గుర్తించకపోవటం నేటి విషాదం. అసలు గడిచిన మూడు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్న నమూనాలే మన దేశంలో మౌలిక పరిశోధ నలకు మూలమవుతున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో కలిసి ఉమ్మడిగా పరిశోధనాలు నిర్వహించేందుకు మన యూనివర్సిటీలు తగినంత ఆసక్తి కనబర చడం లేదు. వైజ్ఞానిక శాస్త్ర పరిశోధన రంగంలో అపార ప్రతిభాపాటవాలు కలిగిన వారిని గుర్తించి ప్రోత్సహించడం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మౌలిక పరిశోధన, శాస్త్రీయ విద్యా ప్రమాణాలను పెంపొందించడం ఎలాగన్నది మన విశ్వ విద్యాలయాలకు పెను సవాలే. సరికొత్త ఆలోచనల సృష్టి తద్వారా గొప్ప ఆవిష్క రణలు చేసేందుకు మన యూనివర్సిటీలకు సరైన ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది. కొత్త ఆలోచనల్ని సాకారం చేసేందుకు మన వర్సిటీలకు భారీగా నిధులు కేటాయించాలి. అంతేకాదు. మన యూనివర్సిటీల్లో ఖాళీగా వున్న స్థలాల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశోధనా కేంద్రాలు నిర్మించేలా ఆ సంస్థలకు వెసులుబాటు కల్పించి, ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది. దాంతో ఆ విద్యా సంస్థలు సరికొత్త పరిశ్రమలకు వైజ్ఞానిక సంపద అందుబాటులోకి వస్తుంది. విద్యా సంస్థల్లో చదువు పూర్తి చేసుకున్న వారికి ఆ సంస్థల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. భాగస్వామ్య పరిశోధన ఊపందుకుంటోంది. నిధుల ప్రవాహమూ పెరుగుతోంది. పెద్దగా పనికి రాని పథకాల కోసం కోట్ల రూపాయలు వృథా ఖర్చు చేస్తున్న మన ప్రభుత్వాలు విజ్ఞానాన్ని పెంపొందించే విశ్వవిద్యాలయాలను చిన్నచూపు చూడటం బాధా కరం. స్థూల జాతీయోత్పత్తిలో ఆరు శాతం విద్యకు, అందులో ఒకటిన్నర నుంచి రెండు శాతం ఉన్నత విద్యకు కేటాయిం చాలని జాతీయ విజ్ఞాన సంఘం సూచిందింది.

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల ప్రభావం విశ్వవిద్యాలయాలపై బాగానే పడింది. అనేక కాలేజీలకు స్వయంప్రతిపత్తి లభించింది. మరోవంక సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు గిరాకీ పెరి గింది. ఉన్నత విద్యారంగంలో తామర తంపరగా పుట్టుకొచ్చిన విద్యావ్యాపార సంస్థలవల్ల విద్యా నాణ్యతలు పెరగలేదు సరికదా… విద్యార్థుల జేబుకు చిల్లు పడింది. రాష్ట్రంలోని 32 విశ్వ విద్యాల యాల్లో రెండొంతులు అంతంత మాత్రమైన విద్యా ప్రమాణాలతో కలవర పెడుతున్నాయి.

   ప్రక్షాళనే … పరిష్కారం!

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీ కరణల ప్రభావం విశ్వవిద్యాలయాలపై బాగానే పడింది.అనేక కాలేజీలకు స్వయం ప్రతిపత్తి లభించింది. మరోవంక సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు గిరాకీ పెరి గింది. ఉన్నత విద్యారంగంలో తామరతంపరగా పుట్టుకొచ్చిన విద్యావ్యాపార సంస్థలవల్ల విద్యా నాణ్యతలు పెరగలేదు సరికదా… విద్యార్థుల జేబుకు చిల్లు పడింది. రాష్ట్రంలోని 32 విశ్వ విద్యాల యాల్లో రెండొంతులు అంతంత మాత్రమైన విద్యా ప్రమాణాలతో కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న విద్యా నియంత్రణకు దేశంలో అనేక సంస్థలకు బదులుగా జాతీయ స్థాయిలో ఒకే ఒక్క ఉన్నత స్థాయి కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ యశపాల్ కమిటీ సూచించింది. దానికి ఎన్నికల సంఘం తరహాలో విస్తృతాధికారాలు ఉండాలని అభిప్రాయపడింది. ఉన్న విద్యా రంగం ఉన్నతికి స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను రూపొందించాలని శామ్ పిట్రోడా నేతృత్వంలోని జాతీయ విజ్ఞాన సంఘం గతంలోనే సూచించింది. ఉన్నత విద్యా రంగం మళ్ళీ ఓ వెలుగు వెలగా లంటే ప్రభుత్వ జోక్యం, రాజకీయాల ప్రమేయం ఉండరాదని కూడా పేర్కొంది. నూతన శతాబ్ది సవాళ్లను ఎదుర్కోవటానికి మన దేశంలో ఉన్నత విద్యా రంగ పునర్జీవనమే మేలైన మార్గమని పుష్కరం కిందటే యునెస్కో అంతర్జాతీయ సదస్సు స్పష్టం చేసింది.మొత్తంగా మన యూనివర్సిటీలను ఆధునిక పరిశోధనా కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు బహుముఖంగా కృషి చేయాల్సి ఉంది. దేశాన్ని అనేక గడ్డు పరిస్థి తులనుంచి గట్టెక్కించే శక్తి సామర్థ్యాలు కలిగివున్న శాస్త్ర సాంకేతిక రంగానికి, అంటే మన యూనివర్సిటీలకు భారీగా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో వాటిని బలోపేతం చేయాల్సి ఉంది. ఇలాంటి కీలక నిర్ణయాల వల్ల మన విశ్వవిద్యాలయం పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం వుంది. తద్వారా నలంద, తక్షశిల వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విద్యాసంస్థలను స్థాపించి, సమర్థ వంతంగా నిర్వహించిన మన చరిత్ర పుట లకే పరిమితం కాకుండా వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *